ఎవరేంటో ప్రజలకు తెలిసిపోయింది..

టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో చంద్రబాబు సర్కారు వేల కోట్ల అవినీతికి పాల్పడిందని   విజయ సాయిరెడ్డి నిప్పులు చెరిగారు. ట్విటర్‌ వేదికగా పలు అంశాలపై స్పందించారు.  


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  నాలుగు నెలల్లోనే రివర్స్ టెండర్ విధానంలో రూ.2000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారు. నువ్వు అధికారంలో ఉంటే 15% ఎక్సెస్ లు, నామినేషన్లతో పనులు కట్టబెట్టి రూ.15 వేల కోట్లు దోచుకునేవాడివి. పరిపాలన అంటే లూటీ చేయడమే అన్న ఫిలాసఫీ కదా నీది. ఎవరేంటో ప్రజలకు తెలిసిపోయింది.


 వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు  ఫ్లెక్సీలు కట్టుకోవద్దట. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడు. నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు  బతుకుతున్నారనుకుంటున్నావా బాబూ? ఎవడబ్బ సొమ్మని ఫ్లెక్సీలు కడతారని చించుకుంటున్నావు. 14 ఏళ్లు సీఎంగా  చేసినోడివి ఇంతగా పతనమవుతావని అనుకోలేదు.


కుప్పం వెళ్లి అన్న క్యాంటీన్లు రద్దు చేశారని వాపోయాడు. పేద వాళ్లకు తిండి దొరకకుండా చేశారట. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల్లో రూ.5 భోజనం కోసం ఎదురుచూసే వాళ్లుండటమేమిటి? కుప్పంలో పేదరికమే లేదని గంటాపథంగా చెప్పాల్సిన వాడివి. ఇంత దీనపు పలుకులు ఏమిటి? అని విజయ సాయిరెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు.