పోలీసులు సక్ర‌మంగా స్పందిస్తే.. అల్ల‌ర్లు ఉండేవి కావు: సుప్రీం

 షహీన్‌భాగ్‌ నిరసనలపై పిటిషన్లు విచారించేందుకు ప్ర‌స్తుతం అనుకూల వాతావరణం లేదని సుప్రీంకోర్టు తెలిపింది.  నిరసనకారులతో సుప్రీంకు చెందిన ఇద్దరు మధ్యవర్తులు ఇటీవల చర్చలు చేపట్టారు. వారు ఇచ్చిన నివేదికను ఇవాళ సుప్రీంకు సమర్పించారు.  షహీన్‌భాగ్‌ నిరసనల గురించి చర్చించాలంటే.. వాతావరణం నిర్మలంగా ఉండాలని జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. ముందుగా ప్రశాంతత ఏర్పడాలని, ప్రస్తుతం ఎన్నో పెద్ద అంశాలను పరిశీలనకు ఉన్నాయని, రెండు వర్గాలు బాధ్యతతో వ్యవహరించాలని జస్టిస్‌ కౌల్‌ అన్నారు. ఢిల్లీలో జరిగిన అల్లర్ల గురించి కూడా ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.  పోలీసుల్లో ప్రొఫెషనలిజం కొరువడిందని జస్టిస్‌ కౌల్‌ అన్నారు.  చట్టం ప్రకారం పోలీసులు వ్యవహరిస్తే, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉత్పన్నం కావన్నారు. ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే, పోలీసులు ముందుకు వస్తున్నారని, లేదంటే వాళ్లలో చలనం లేకుండా పోయిందన్నారు. ఢిల్లీ అల్లర్లపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని, దాని గురించి ఈ సమయంలో మేమేమీ చెప్పలేమన్నారు. ప్రజలు వినియోగించే రహదారులను.. నిరంతరం నిరసనలకు వాడకూడదన్నారు.  పోలీసులు, అధికారులు ఓ వ్యవస్థ ప్రకారం పనిచేయాలన్నారు. అడ్వకేట్లు సాధనా రామచంద్రన్‌, సంజయ్‌ హెగ్డేలు మధ్యవర్తులుగా వెళ్లి షహీన్‌భాగ్‌ నిరసనకారులతో చర్చించారు.  సీఏఏను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న‌కారులు ష‌హీన్‌భాగ్‌లో నిర‌స‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే